సీఏఏలో మైనారిటీలకు నష్టం చేసే ఏ ఒక్క అంశం కూడా లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు. కేంద్రప్రభుత్వం అనేక సార్లు సీఏఏ వల్ల దేశంలో ఎవరికి నష్టం లేదని చెప్పినప్పటికి.. కొంత మంది కావాలనే విష ప్రచారం చేస్తున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. లేని అంశాన్ని ప్రచారం చేస్తూ.. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయని.. ఇక్కడి మైనారిటీ ప్రజలను పాకిస్తాన్‌ పంపిస్తారంటూ దిగజారుడు ప్రచారం చేయడాన్ని కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఆ వ్యాఖ్యలను నమ్మవద్దన్నారు. అసదుద్దీన్‌ నోటికి అడ్డు అదుపు లేకుండా పోయిందని.. కేసీఆర్‌ అండ చూసుకొని అసద్‌ రెచ్చిపోతున్నాడని కిషన్‌రెడ్డి అన్నారు. ఎమ్‌ఐఎమ్‌ దోస్తాన్‌తో.. కేసీఆర్‌ పులి మీద స్వారీ చేస్తున్నాడని విమర్శించారు

అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామంటున్న రాజకీయ పార్టీలేవైనా కానీ.. దేశంలో ఉన్న 130 కోట్ల ప్రజలకు సీఏఏలో వ్యతిరేకంగా ఉన్న అంశాలను చెప్పాలన్నారు. మోదీని విమర్శించడానికి ఏమీ లేకనే.. సీఏఏపై దుష్ప్రచారం చేస్తున్నారని.. దేశం కోసం పని చేస్తున్న ప్రభుత్వం మోదీ ప్రభుత్వమేనన్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ, ఎమెఐఎమ్‌ పార్టీలు పోటాపోటీగా సీఏఏకు వ్యతిరేకంగా సభలు పెడుతున్నాయని.. చట్టంలో ఏముందో చెప్పేది ప్రభుత్వంలో ఉన్న తామని.. పాతబస్తీలో ఉన్న అసదుద్దీన్‌ ఓవైసీ కాదన్నారు. ఒక చేతిలో జాతీయ పతాకం పట్టుకొని.. మరో చెత్తో రాళ్లతో పోలీసులను కొట్టి చంపడం ఎలాంటి దేశ భక్తి అని ప్రశ్నించారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో జరుగుతున్న హింస వెనక ఎవరి హస్తం ఉంది అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.