ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనలో ఉన్నారు. ఆయన్ను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తలను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు భారీగా మోహరించారు.

చంద్రబాబు నాయుడుకు ఇటీవలి ఎన్నికల్లో కుప్పంలో భారీగా ఓట్లు తగ్గాయి. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కుప్పంకు కనీస అవసరాలు తీర్చలేదని అక్కడి ప్రజలు భావిస్తూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చే వరకూ కుప్పంకు మున్సిపాలిటీ రాలేదంటే చంద్రబాబు నాయుడు కుప్పానికి ఏమి మేలు చేశారో చెప్పాలని వైసీపీ నాయకులు ప్రశ్నించారు. ఇప్పటికీ కొన్ని వందల మంది కుప్పం ప్రజలు రైళ్లలో బతుకుదెరువు కోసం బెంగళూరు నగరానికి ప్రతి రోజూ వెళుతూ ఉంటారు. వారికి కూడా సరైన ఉపాధి అవకాశాలు చంద్రబాబు నాయుడు కల్పించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఇక తెలుగుదేశం హయాంలో వడ్డీ వ్యాపారులు కుప్పంలోని సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని విమర్శలు వచ్చాయి. ఏది ఏమైనా తమిళనాడు, కర్ణాటకలకు బోర్డర్ లో ఉన్న కుప్పంను సరైన సమయంలో అభివృద్ధి చేసి ఉండి ఉంటే ఉపాధి అవకాశాలు భారీగా దక్కేవని అంటున్నారు. అప్పుడప్పుడు మాత్రమే కుప్పంకు వచ్చే చంద్రబాబు నాయుడు నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారని.. కొందరు నాయకులు అక్కడ చక్రం తిప్పడానికి చేసిన ప్రయత్నాలు తెలుగుదేశం కార్యకర్తలకు కూడా చాలా తలనొప్పులు తెచ్చిపెట్టాయి. మిగిలిన ముఖ్యమంత్రులు తమ నియోజక వర్గాలను అభివృద్ధి చేసుకున్నంతగా.. చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని ఎప్పటి నుండో విమర్శలు ఉన్నాయి.. అందుకే రాను రాను ఎలెక్షన్స్ లో చంద్రబాబు నాయుడు ఆధిక్యం తగ్గుతూ వస్తోంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కుప్పంపై దృష్టి పెట్టడం చాలా మంచిది.. లేదంటే రాబోయే ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.