ఓయో రూమ్స్.. ఏ నగరంలో అయినా హోటల్ రూమ్స్ ను బుక్ చేసుకోవడం చాలా తేలిక.. విపరీతమైన బుకింగ్స్ తో ఇటీవలి కాలంలో వార్తల్లో నిలిచింది కూడానూ..! కానీ ఈ సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ కన్సాలిడేటెడ్ సంస్థ దేశ వ్యాప్తంగా హోటల్ రూమ్స్ ను అందిస్తోంది. అటువంటి సంస్థ ఇప్పుడు భారీ నష్టాల్లో కూరుకుపోయింది. మార్చి 2018తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో రూ. 370 కోట్లు నష్టాలు వచ్చాయి. 2019 సంవత్సరంలో రూ. 2,390 కోట్ల రూపాయల నష్టం వచ్చింది.
2018 సంవత్సరంలో ఆదాయం 211 మిలియన్ డాలర్లు ఆర్జించగా.. 2019లో 951 మిలియన్ డాలర్లకు పెరిగింది. అంతర్జాతీయ విస్తరణ నిమిత్తం అధిక నిధులను కేటాయించడంతోనే నష్టాలు పెరిగినట్లు సంస్థ చెబుతోంది. భారత్ లో మాత్రం నష్టాల సంఖ్య బాగా తగ్గింది. భారత్ లో నష్టం 24 శాతం నుంచి 12 శాతానికి తగ్గిందని సంస్థ తెలిపింది. ఇటీవలి కాలంలో ఏదైనా నగరానికి వెళ్ళినప్పుడు బస చేయాలి అనుకుంటే ‘ఓయో రూమ్స్’ వైపే అందరి దృష్టీ వెళుతోంది. ఇదే భారత్ లో నష్టాలు తగ్గడానికి ముఖ్య కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.