కంబళ పోటీల్లో శ్రీనివాస గౌడ అనే యువకుడు 100 మీటర్ల దూరాన్ని 9.55 సెకన్లలో పరుగెత్తడం సంచలమైంది. సంప్రదాయ కంబళ పోటీల్లో దున్నపోతులతో సమంగా 100 మీటర్ల దూరాన్ని శ్రీనివాస గౌడ కేవలం 9.55 సెకన్లలోనే అధిగమించాడు. శ్రీనివాస గౌడ ప్రతిభను ఆనంద్ మహీంద్రా లాంటి వాళ్ళు ట్వీట్ కూడా చేశారు. అతడికి ట్రైనింగ్ ఇస్తే తప్పకుండా భారత్ కు పతకాల వర్షం కురిపిస్తాడని పలువురు అభిప్రాయ పడ్డారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ట్యాలెంట్ ను వృధా కానివ్వం అని మాట ఇచ్చాడు.

తాజాగా శ్రీనివాస గౌడ రికార్డును నిశాంత్ శెట్టి అనే యువకుడు బద్దలుకొట్టాడు. 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.51 సెకన్లలోనే అధిగమించి నిశాంత్ శెట్టి అందరినీ షాక్ కు గురిచేశారు. నిశాంత్ శెట్టి కర్ణాటకలోని బజగోళి జోగిబెట్ట ప్రాంతానికి చెందినవాడు. కంబళ పోటీల్లో నిశాంత్ శెట్టి మొత్తం 143 మీటర్ల దూరాన్ని 13.68 సెకన్లలో పూర్తి చేశాడు.

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) కోచ్ లు శ్రీనివాస గౌడకు ట్రయల్స్ నిర్వహించాలని భావిస్తున్నారు. సోమవారం నాడు సాయ్ అధికారులతో మాట్లాడిన శ్రీనివాస గౌడ తనకు నెల సమయం కావాలని తెలిపాడు. నెల రోజుల పాటూ కంబళ టోర్నమెంట్ లలో పాల్గొనాల్సి ఉందని.. అవి పూర్తయి విజయాలు సాధించాల్సి ఉందని అన్నాడు. తాను సాధించిన రికార్డులో దున్నపోతులదే కీలకపాత్ర అని వినమ్రంగా వెల్లడించాడు. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప శ్రీనివాస గౌడకు మూడు లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేయగా.. ఆ డబ్బు కూడా దున్నపోతులకే చెందుతుందని శ్రీనివాస గౌడ చెప్పడం విశేషం. ఇప్పుడు శ్రీనివాస గౌడ పేరుతో పాటూ నిశాంత్ శెట్టి పేరు కూడా కర్ణాటక మీడియాలో మారు మ్రోగిపోతోంది.