2000 రూపాయలను మార్కెట్ లో ప్రవేశ పెట్టినప్పటి నుండి ఎన్నో రకాల వదంతులు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రద్దు చేయబోతున్నారు.. అప్పుడు రద్దు చేయబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు.. వాట్సప్ లో విపరీతమైన ఫార్వర్డ్ మెసేజీలు..! ప్రతి సారీ వీటిని ప్రభుత్వం ఖండిస్తూనే వస్తోంది. తాజాగా కూడా అలాంటి వదంతులే ఎక్కువ అయ్యాయి.. వీటికి ఆదిలోనే తెరదించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.

రెండు వేల కరెన్సీ నోటును రద్దు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వంలేదని.. కేంద్రం వద్ద అటువంటి ప్రతిపాదన ఏమీ లేదని నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో 2 వేల నోటు మార్కెట్‌లో అంతగా కనిపించకపోవడంతో రద్దు పుకార్లు మొదలయ్యాయి. 2000 నోటును రద్దు చేసే యోచనలో కేంద్రం ఉందని, అందువల్ల రిజర్వ్‌బ్యాంక్‌కు చేరుతున్న నోట్లను చేరినట్టే అట్టేపెట్టేస్తోందని వార్తలు వైరల్ అయ్యాయి. ప్రభుత్వం వద్ద అటువంటి ఆలోచన ఏమీ చేయడం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు నిర్మల సీతారామన్. తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేసింది. వాటి స్థానంలో కొత్త నోట్లను తీసుకొని వచ్చారు.