పెద్ద పెద్ద ప్రముఖుల దగ్గర పని చేసే వారికి కూడా అంతో ఇంతో పరపతి ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఆ ప్రముఖులు చెప్పే వాటికంటే వాళ్ళ కింద ఉండే వాళ్ళు చెబితేనే అంతో.. ఇంతో పనులు జరుగుతూ ఉంటాయని నమ్మే వాళ్ళు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. వారి కింద పని చేస్తున్నాం.. వీళ్ళ కింద ఉన్నామంటూ.. మేము ఏది చెప్తే అది జరుగుద్ది అంటూ కొందరు చేసే మోసాలు కూడా అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి భార్య భారతి దగ్గర తాను పీఏగా పనిచేస్తున్నానని చెప్పి.. తాను తలుచుకుంటే ఉద్యోగం ఇచ్చేస్తానని చెప్పి చేసిన బడా మోసం ఇప్పుడు వెలుగు లోకి వచ్చింది.
విజయవాడ సమీపంలోని గొల్లపూడికి చెందిన కుమరేశ్వర అఖిలేష్‌ ఐసీఐసీఐ బ్యాంకులో కొన్నాళ్లు డిప్యూటీ మేనేజర్‌గా పనిచేసి మానేశాడు. 2019 అక్టోబరులో తిరుమలో గదుల కోసం జగదీష్‌ సత్యశ్రీరాం అనే వ్యక్తి ఫోన్‌ చేశాడు. సత్యశ్రీరాం తాను వై.ఎస్‌.భారతి పీఏనని.. తనకు ఉన్న సర్కిల్ మామూలుది కాదంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు పంచాయతీరాజ్‌ శాఖలో ఎవరికైనా ఉద్యోగాలు కావాలంటే తాను ఇప్పించగలనంటూ ఓ ఎర వేశాడు. అంతే ఖాళీగా ఉన్న అఖిలేష్‌ ఇది నిజమేనని నమ్మేశాడు. ఎవరికో ఎందుకు ఇప్పిస్తారు సార్.. నాకే ఉద్యోగం ఇప్పించాలని అడిగాడు. సత్యశ్రీరాం ఇదేదో గిట్టుబాటు అవుతుంది అనుకుని అఖిలేష్ దగ్గర నుండి రూ.60 వేలతో పాటు, విద్యార్హత ధ్రువపత్రాలు కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా అఖిలేష్ దగ్గర నుండి సత్యశ్రీరాం కొంత డబ్బులు తీసుకున్నాడు. కానీ ఉద్యోగం మాత్రం అతడికి ఇప్పించలేకపోయాడు సత్యశ్రీరాం.. కొందరిని పట్టుకుని ఆరా తీస్తే అతను అసలు భారతి పీఏనే కాదని తేలడంతో తెల్లబోవడం అఖిలేష్ వంతైంది. తనలాగే అతను మరో ఇద్దరిని కూడా మోసం చేశాడని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు విచారిస్తున్నారు.