ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ లో ఊహించినట్లుగానే ‘ఆప్’ ఈ ఎన్నికల్లో స్వీప్ దిశగా దూసుకుపోతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సరైన ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోవడం ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసొచ్చింది. బీజేపీ గత ఎన్నికలతో పోలిస్తే కాస్త పుంజుకున్నట్లుగానే కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ ఓటమిని ముందుగానే ఊహినట్లు కనిపిస్తోంది. ఢిల్లీలోని ఆ పార్టీ కార్యాలయంలో ఓ పోస్టర్‌ అందరినీ ఆకర్షిస్తోంది. ‘విజయంతో మనం అహంకారులుగా మారకూడదు. పరాజయంతో మనం నిరాశకు గురికాకూడదు’ అని రాసి ఉన్న ఆ పోస్టర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫొటో ఉంది. ఆ పోస్టర్‌లో ఉన్నదానిని బట్టి బీజేపీ తన ఓటమిని ముందే ఊహించిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కార్యకర్తల్లో నిరాశ దరిచేరకూడదనే ఉద్దేశంతోనే బీజేపీ ఈ పోస్టర్ అతికించినట్టు చెబుతున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ విజయం ఖరారు కావడంతో ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు సీఎం కేజ్రీవాల్ ప్రత్యేక ర్యాలీని నిర్వహించనున్నారు. కేజ్రీవాల్ ఇంటికి విజయరథం చేరుకోగా.. ఆ ఓపెన్ టాప్ జీపుపై ప్రజలకు అభివాదం చేస్తూ, కేజ్రీవాల్ నగరంలోని పలు ప్రాంతాలను చుట్టి రానున్నారు.