అమరావతి: విజయవాడలోని అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వేదిక కల్యాణ మండపం వద్ద కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం తెదేపా అధినేత చంద్రబాబు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు ఐకాస నేతలు బస్సు యాత్రను ప్రారంభించేందుకు పాదయాత్రగా బయల్దేరగా.. పోలీసులు అక్కడ భారీగా మోహరించి వారిని అడ్డుకున్నారు.

దీంతో చంద్రబాబు సహా నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తిరగబడితే పోలీసులు ఏమీ చేయలేరన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ అరెస్టులతో తమను ఆపలేరన్నారు. అనంతరం చంద్రబాబుతో పాటు ఇతర నేతలంతా బెంజిసర్కిల్‌ వద్ద రోడ్డుపైనే భైఠాయించారు. పోలీసులు వారితో చర్చలు జరిపారు.