కరోనా ఎఫెక్ట్ తో ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. కరోనా నివారణపై దృష్టిసారించిన కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. ఏపీలో జరగాల్సిన ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు, ఎలక్షన్ కమీషనర్ రమేశ్‌ కుమార్‌ ప్రకటించారు. కర్ణాటక, తెలంగాణాలలో అన్ని స్కూళ్లు, మాల్స్, సిన్మాహాల్స్ మూసేసిందని, అత్యవసర సమీక్ష నిర్వహించిన తర్వాత తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇది ఎన్నికల ప్రక్రియ నిలిపివేత మాత్రమే, రద్దు కాదన్నారు. ఆరువారాల అనంతరం ఎన్నికలు జరుగుతాయన్నారు. ఇప్పటివరకూ జరిగిన ప్రక్రియ యధావిథిగానే ఉంటుందని, జరగాల్సిన ఎన్నికలు మాత్రమే వాయిదా వేసామన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కొనసాగుతారని, ఎన్నికల కోడ్ కొనసాగుతుందని కమీషనర్ రమేశ్‌ కుమార్‌ చెప్పారు.