కరోనా నిరోధక చర్యలపై ఆంధ్రప్రదేస్ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ప్రజలు ఆందోళన చెందవద్దని, వదంతులు నమ్మవద్దని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి విజ్ఞప్తి చేసారు. నెల్లూరు జిల్లాలో కరోనా బాధితుడు కోలుకుంటున్నాడని , 14 రోజుల తర్వాత పరీక్షించి డిశ్చార్జ్‌ చేస్తామన్నారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 675 మంది ప్రయాణికులని అబ్జర్వేషన్ లో ఉంచామన్నారు. 428 మందిని వారి ఇంటివద్దనే ఉంచి డాక్టర్స్ పరీక్షిస్తున్నారని చెప్పారు. 233 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యిందని ఆసుపత్రిలో 14 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారని జవహర్రెడ్డి తెలిపారు. 61 మంది శాంపిల్స్‌ తీసుకొని పరీక్షలకి పంపితే 52 మందికి నెగిటివ్‌ వచ్చిందని’ 8 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సిఉందన్నారు. కరోనా వైరస్‌ ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై నిఘా పెట్టామని, విశాఖ ఎయిర్‌పోర్టులో 8వేల 6వందల 91 మంది ప్రయాణికుల్ని స్క్రీనింగ్ చేశామని చెప్పారు. వీరిలో 64 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నాయన్నారు. విశాఖ, గన్నవరం, కృష్ణపట్నం ఓడరేవుల్లో కూడా ప్రయాణికులకి స్క్రీనింగ్ చేయగా వారిలో ఎలాంటి రోగలక్షణాలూ కనబడలేదన్నారు.కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఇళ్లలోనే ఉండాలని జవహర్రెడ్డి విజ్ఞప్తి చేసారు. కుటుంబసభ్యులు, ఇతరలతో కలవకూడదన్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే మాస్క్‌ను ధరించి 108 వాహనంలో దగ్గరలో వున్న ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని చెప్పారు. అన్ని జిల్లాల్లోనూ కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశామన్నారు.అన్నిచోట్లా మాస్క్‌లు అందుబాటులో ఉంచామని, కరోనా అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు ( 0866-2410978)కి తెలియజేయాలని జవహర్రెడ్డి తెలిపారు. వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని చెప్పారు.