ఏపి ముఖ్యమంత్రి వై.ఎస్. రెడ్డి బాబాయ్, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, టీడీపీ నాయకుడు బీటెక్ రవి, బీజేపీ నాయకుడు ఆదినారాయణరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. కడప జిల్లా పులివెందులలోని ఆయన సొంత ఇంట్లో…2019 మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్షపార్టీకి చెందీన వివేకానందరెడ్డి హత్యకు గురికావడం రాజకీయ సంచలనం అయింది. వివేకా హత్య వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్న అనుమానంతో… కేసును సీబీఐతో విచారణ జరిపించాలని అప్పట్లో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం సిట్ వేసి వదిలేసింది. 2019 లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం సిబీఇ చేత విచారణ జరిపించాలన్న డిమాండ్ ని ప్రక్కన పెట్టేసింది. కానీ వివేకా ఫ్యామిలీ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా కేసుతో ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్న బీటెక్ రవి, ఆది నారాయణరెడ్డిలు కూడా కేసుని సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనితో సీబీఐ విచారణ అవసరం లేదని, సిట్ విచారణ చివరి దశకు వచ్చిందని జగన్ ప్రభుత్వం హైకోర్టులో వాదనలు వినిపించింది. సంతృప్తిచెందని హైకోర్టు కేసును సీబీఐకి అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడం సర్వత్రా ఉత్కంఠని కలిగిస్తోంది.

.