తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఆ పార్టీ హైకమాండ్ బండి సంజయ్‌ని నియమించింది. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, లక్ష్మణ్ స్థానంలో తక్షణం రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టమని బండి సంజయ్‌కు కి బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్ ఎంపీ అయిన బండి సంజయ్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌పై గెలుపొందారు. ఆర్ఎస్ఎస్‌తో సత్సంబంధాలున్న సంజయ్ లోగడ ఏబీవీపీ, యువమోర్చాలో పనిచేశారు. 1971లో జన్మించిన బండి సంజయ్ కుమార్ కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌కి రెండు సార్లు డైరెక్టర్‌గా పనిచేశారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల ప్రచార ఇంచార్జ్‌గా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్‌గా, జాతీయ కార్యదర్శిగా, కేరళ,తమిళనాడులలో పార్టీ ఇంచార్జి‌గా సేవలందించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కి బిజెపి తరపున మూడుసార్లు కార్పొరేటర్ గా గెలిచారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయినా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి సత్తా చాటారు.