నార్త్ ఈస్ట్ ఢిల్లీలో ఇంకా హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి.. శుక్రవారం నాటికి మృతి చెందిన వారి సంఖ్య 42 మందికి చేరింది. ఢిల్లీ అల్లర్లలో ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ అంకిత్ శర్మ హత్యతో సంబంధం ఉన్నట్టుగా తాహిర్ హుస్సేన్ అనే వ్యక్తిపై అభియోగాలు నమోదయ్యాయి. అతడు ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ అని తెలిపింది. ప్రస్తుతం అతడు ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలీదు. తాహిర్ హుస్సేన్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అంకిత్ శర్మ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం హుస్సేన్ తన కుటుంబ సభ్యులతో కలిసి పరారీలో ఉన్నాడు. అతని సెల్‌ఫోన్ సిగ్నల్ చివరిగా ఢిల్లీ-ఉత్తర ప్రదేశ్ సరిహద్దు సమీపంలో ట్రేస్ అయినట్లు తెలుస్తోంది. హుస్సేన్ టెర్రస్‌పై నడుచుకుంటూ వెళ్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. అతని సపోర్టర్లు రాళ్లు విసురుతూ, పెట్రోల్ బాంబులు వేస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. అంకిత్ శర్మ ను తాహిర్ ఇంకా నలుగురు వ్యక్తులు కలిసి బయటకు లాగి దాడి చేసినట్లు కొందరు తెలిపారు. వైరల్ అవుతున్న వీడియోల్లో మాస్క్‌లు ధరించిన తాహిర్, మిగిలిన యువకులు, రాళ్లు, బుల్లెట్లు, పెట్రోల్ బాంబులతో మిగిలిన వారిపై విరుచుకుపడ్డారు.

శుక్రవారం ఫోరెన్సిక్ టీమ్ తాహిర్ హుస్సేన్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. చాంద్‌బాగ్‌లోని హుస్సేన్ నాలుగంతస్తుల రెసిడెన్షియల్ భవనంలో తనిఖీలు నిర్వహించి.. పలు శాస్త్రీయ ఆధారాలను సేకరించారు. పెట్రోల్ బాంబులు, ఖాళీ సీసాలు, రాళ్ళు మరియు ఇటుకలు టెర్రస్ మీద మరియు హుస్సేన్ ఇంటి లోపల దొరికినట్లు తెలుస్తోంది. అంకిత్ శర్మ మృతదేహం లభ్యమైన డ్రైనేజీ వద్దకు వెళ్లి.. అక్కడ రక్తపు నమూనాలతో పాటు పలు ఆధారాలను సేకరించారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులతో కలిసి అల్లర్లు జరిగిన ప్రాంతాల్లోనూ ఫోరెన్సిక్ టీమ్ పలు ఆధారాలను సేకరించింది. అంకిత్ శర్మ శవపరీక్ష నివేదికలో అతన్ని 400 కన్నా ఎక్కువ సార్లు దారుణంగా పొడిచి చంపారని వెల్లడైంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తాహిర్‌ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది.

దయాల్పూర్ పోలీస్ స్టేషన్లో మొదటి సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు అయిన వెంటనే అతను పారిపోయి ఉండవచ్చని అధికారులు తెలిపారు. దీంతో ఉత్తర ప్రదేశ్ మరియు ఇతర సరిహద్దు రాష్ట్రాల్లోని రహస్య స్థావరాల వద్ద స్పెషల్ టీం పోలీసుల, యాంటీ టెర్రర్ స్క్వాడ్ సహా ఐదు పోలీసు బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయి. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పోలీసులు పర్యటిస్తున్నారు. ఢిల్లీ అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు 148 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఇప్పటివరకు 603 మందిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ శాంతి భద్రతల అదనపు కమిషనర్‌ ఎస్‌ఎన్‌ శ్రీవాత్సవ మీడియాతో మాట్లాడారు. మున్సిపల్‌ కౌన్సిలర్‌ తాహిర్‌ హుస్సేన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అల్లర్లకు కారకులైన వారికి శిక్ష పడేలా చేస్తామని శ్రీవాత్సవ పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు కూడా హై-అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా కొన్ని సోషల్ మీడియా పేజీల పైనా, వాట్సప్ లో సర్క్యులేటింగ్ అవుతున్న మెసేజీలపైనా ఢిల్లీ పోలీసులు స్పెషల్ సెల్ ఏర్పాటు చేశారు. కావాలనే కొన్ని ఫోటోలను వైరల్ చేస్తున్న కొన్ని ఐసిస్ సానుభూతిపరుల ఛానల్స్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. టెర్రర్ గ్రూపులకు ఆకర్షితులైన యువకులపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఢిల్లీ పోలీసులు. ఎవరైతే అటు వైపు నుండి సూచనలు విని ఈ దాడులకు పాల్పడ్డారో వారిని కూడా పోలీసులు విచారించనున్నారు. గతంలో టెర్రరిస్టు యాక్టివిటీస్ లో అరెస్టు అయి.. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన వారు కూడా ఈ అల్లర్లలో ముఖ్య భాగమయ్యారని పోలీసులు అనుమానిస్తున్నారు.