ఆయన కన్పిస్తే సమ్మోహనం. నర్తిస్తే అభిమానులకు ఆనందహేళ.. ఆయనను చూడాలని… ఆయన మాట్లాడితే వినాలని… అభిమానులు పరితపిస్తారు. ఆరు పదుల వయసులోనూ ఆయన చేసే ఫైట్సూ… డ్యాన్సూ చూసి అభిమానులు పండుగ చేసుకుంటారు. తెలుగు ఇండస్ట్రీలో రారాజుగా ఎదిగిన ఆయన ఇప్పుడు రెండో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఆయన ఓ ప్రభంజనం. కంటిచూపుతో సినీ ఇండస్ట్రీని శాసించారు. ఇండస్ట్రీకి వంద రోజుల పండుగలతో హుషారు తెచ్చారు. టాలీవుడ్ స్థాయిని బాలీవుడ్ వైపు దూసుకెళ్లాలా చేశారు. ఆతర్వాత బాక్స్ ఆఫీస్ రికార్డులను చెరిపేసి తనకంటూ ఒక మేనియా క్రియేట్ చేశారు. ఒక ఫ్యామిలీలో ఒకరిద్దరు స్టార్లు ఉండటమే గొప్ప. కానీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి ఆయన ఒక మెగా ఫ్యామిలీని ఇచ్చారు. ఇప్పుడు వారందరూ కూడా సూపర్ స్టార్లే. టాలీవుడ్ ఇప్పుడు ఆ కుటుంబం చుట్టూ తిరుగుతోంది.

మెగాస్టార్ సినీ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అయితే ఆయన కష్టం ఆయనను ఎప్పుడూ విజయపథానికి తీసుకెళ్లింది. కానీ… 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి… సామాజిక న్యాయం పేరుతో సమరశంఖం పూరించారు. అయితే నాడు వైఎస్ ప్రభంజనం, మహాకూటమి కలయికతో ప్రజారాజ్యం పార్టీ అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయింది. అయితేనేం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 17 శాతం ఓట్లు సంపాదించి 18 సీట్లను గెలుచుకొని సంచలనం సృష్టించారు. రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేశారు మెగాస్టార్. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మారిన పరిస్థితుల్లో పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఇటీవల చిరంజీవి రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ కాబోతున్నారన్న ప్రచారం బాగా విన్పిస్తోంది. చిరంజీవి ఇప్పుడు రాజకీయాలను పూర్తిగా వదిలేశారని… ఇక ఆయన కేవలం సినిమా ఇండస్ట్రీవైపే చూస్తున్నారని అందరూ చెబుతూ వచ్చారు. ఆయన ఆలోచన మాత్రం రాజకీయంగా ఒక హోదా వైపు ఉందని తెలుస్తోంది. అందుకు పెద్దల సభ కరెక్ట్ అని కూడా ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తమ్ముడు జనసేన పార్టీతో గత ఎన్నికల్లో చేదు ఫలితాలను చూసిన దరిమిలా… మెగాస్టార్ వ్యూహాత్మంగా అడుగులు వేయాలని భావిస్తున్నారు. నేరుగా రాజకీయాల్లోకి ఇక మెగాస్టార్ వచ్చే అవకాశం లేదన్న అభిప్రాయం కూడా ఆయన సన్నిహితుల నుంచి వస్తోంది. సమాజ సేవ, సినీ ఇండస్ట్రీ రెంటిలోనూ తనదైన ముద్ర ఉండాలంటే అందుకు రాజకీయంగా కూడా ఒక పదవి కూడా అవసరమని… చిరు సన్నిహితుల నుంచి విన్పిస్తోంది. ఆయన సైతం అందుకు సై అన్నట్టుగా సమాచారం. ఇదే విషయం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డికి తెలియడంతో కొత్త రాజకీయం దిశగా అడుగులు పడినట్టు ప్రచారం జరుగుతోంది. చిరంజీవి మనసులో మాట తెలుసుకున్న వైసీపీ పెద్దలు అంతకంటే భాగ్యమేముంటుందన్న ఆలోచనలోకి వచ్చారట. చిరంజీవికి ఇదే విషయాన్ని వైసీపీ పెద్దలు చెవినవేసినట్టు కూడా పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ నేత చెప్పారు.

సైరా నరసింహారెడ్డి సినిమాతో తనలో ఉన్న జాతీయత, దేశభక్తిని చాటుకున్న మెగాస్టార్ ఇకపై సినీ ఇండస్ట్రీలోనే కాకుండా… రాజకీయంగానూ యాక్టివ్ కావాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇప్పుడు కుటుంబ సభ్యులు సైతం అందరూ సెటిల్ అయిపోయారు. ఆయన మనవళ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తున్నారు. అదే సమయంలో తనకు అత్యంత ఇష్టమైన సినీ ఇండస్ట్రీకి ఏదో చేయాలన్న తపనతో అడుగులు వేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ… తెలుగు సినీ ఇండస్ట్రీకి చిరంజీవిని పెద్ద దిక్కుగా చేస్తున్నాయని చెప్పవచ్చు. కేవలం సినీ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైతే తాను అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం కొంచెం కష్టమే. అందుకే చిరంజీవి ఆలోచనలు ఇప్పుడు రాజకీయం వైపు చూస్తున్నాయ్.

ఇప్పటికే చిరంజీవి, వైసీపీ పెద్దలతో టచ్ లో ఉన్నారు. సైరా నరసింహారెడ్డి రిలీజ్ విషయంలో ఏపీ సర్కారు ఉదారంగా వ్యవహరించింది. అందుకు కృతజ్ఞతగా మెగాస్టార్ చిరంజీవి సీఎం నివాసానికి సతీసమేతంగా వెళ్లి… సీఎం జగన్ తో చర్చంచారు. వైఎస్ జగన్ సతీమణి భారతి, చిరంజీవి సతీమణి సురేఖ సైతం ఆ సమయంలో ఏకాంతంగా చర్చించుకున్నారని… ఇద్దరూ పరస్పరం అవగాహనతో పనిచేసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చారని కూడా సమాచారం. దాంతోపాటు చిరంజీవి వైసీపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్థించారు. వైజాగ్ కేపిటల్ నిర్ణయం సముచితమంటూ వ్యాఖ్యలు కూడా చేశారు.

మొత్తంగా చిరంజీవిని వైసీపీ దగ్గరకు తీసుకోవాలని భావించడం వెనుక వ్యూహం చాలా పెద్దదే. గత ఎన్నికల్లో కాపు రిజర్వేషన్ల అంశం తన పరిధిలోనిది కాదంటూ కుండబద్ధలు కొట్టిన వైఎస్ జగన్… కాపు సామాజికవర్గంలోని పెద్దల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. అదే సమయంలో ఆ నిర్ణయం బీసీల పట్ల తనకు అనుకూలత లభించేలా చేసిందన్న అభిప్రాయం కూడా ఆ పార్టీలో ఉంది. రిజర్వేషన్ల విషయంలో కాపు సమాజంలోనూ భిన్నాభిప్రాయాలున్నాయ్. ఇప్పుడు వైసీపీ నుంచి బలమైన కాపు నేతలు కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఎన్నికల తర్వాత కూడా కాపు ముఖ్యులు వైసీపీలో చేరడం కూడా మనం చూడొచ్చు. భవిష్యత్ లో ఏపీలో చిరంజీవి మద్దతు ఉంటే అది తనకు రాజకీయంగా వేయి ఏనుగుల బలం అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారట. అదే సమయంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్… రాజకీయంగా వేస్తున్న అడుగులు కూడా అధికార పార్టీకి వ్యతిరేకం. ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవిని ఫ్యాన్ పార్టీలోకి లాగి కీలక బాధ్యతలు అప్పజెప్తే అవి తమకు ఉపయోగమన్న భావని వైసీపీలో ఉంది.

ఒక్కటి మాత్రం నిజం. చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పూర్తి దూరంగా ఉన్నారు. రాజకీయాల గురించి అస్సలు మాట్లాడటం లేదు. సినీ ఇండస్ట్రీని ఏకతాటిపైకి తేవాలన్న లక్ష్యం మాత్రమే ఆయనది.. ఇటీవల ఓ సినిమా ఫంక్షన్లో విజయశాంతి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు నిదర్శనం. సినిమా, రాజకీయాలు రెండింటి గురించి ఆయన నర్మగర్భవ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో చిరంజీవి… మెగా ఫ్యామిలీ సినిమాల గురించి కాకుండా మిగతా సినిమాల గురించి సైతం మాట్లాడుతూ తన పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఆ అభిప్రాయం ఇప్పుడు మెగాస్టార్ ను ఇండస్ట్రీకి పెద్దదిక్కును చేస్తున్నాయ్. ఇక రాజకీయం ఒక్కటే మిగిలింది. సినిమా పవర్ కు రాజకీయం తోడైతే ఆ మజా ఎలా ఉంటుందో చిరంజీవికి చాలా బాగా తెలుసు.