దేశం తర్వాతనే ఎవరైనా అని నమ్మే వ్యక్తి ఆయన..! అలాంటిది తన కూతురు పాకిస్తాన్ జిందాబాద్ అని అనడం అసలు తట్టుకోలేకపోతున్నారు. అందుకే పోలీసులు తన కుమార్తె కాళ్లు విరగ్గొట్టినా బాధలేదు అని చెబుతున్నారు. బెంగళూరులో పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) నిరసనగా నిర్వహించిన ‘సేవ్ కాన్‌స్టిట్యూషన్’ కార్యక్రమంలో అమూల్య అనే అమ్మాయి పాకిస్థాన్ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేసింది.

తన కూతురి ప్రవర్తన చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని.. ఆమెను జైల్లో పెట్టినా, పోలీసులు ఆమె కాళ్లు విరగ్గొట్టినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె తండ్రి చెప్పారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని తాను ఆమెకు చాలా సార్లు చెప్పానని, అయినప్పటికీ తన కూతురిలో ఎలాంటి మార్పు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురి వల్ల తన కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోందని అన్నారు. ప్రస్తుతం అమూల్య పై దేశద్రోహం కేసు నమోదైంది. ఆమె బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా న్యాయమూర్తి నిరాకరించారు. 14 రోజుల పాటు ఆమెను జ్యుడీషియల్‌ కస్టడీకి తీసుకోవాలని ఆదేశించారు. అమూల్యకు బెయిలు ఇవ్వద్దని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు.