జమ్ముకశ్మీర్‌లో భారత సైన్యం-ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా దైవర్‌ గ్రామంలో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. త్రాల్‌ సెక్టార్‌లోని దైవర్‌ గ్రామంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో పోలీసులు, భదత్రా బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి.. భద్రతా బలగాల రాకను గమనించిన ఉగ్రవాదులు వారిపై ఊహించని విధంగా కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన బలగాలు ఉగ్రవాదలుపై వెంటనే ప్రతిఘటించాయి. దీంతో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనపై జమ్ముకశ్మీర్‌ పోలీస్‌ విభాగానికి చెందిన ఐజీ విజయ్‌ కుమార్‌ మట్లాడుతూ ఘటనా స్థలంలో పేలుడు పదార్థాలను, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చనిపోయిన ఉగ్రవాదలు వివరాలను సేకరిస్తున్నామన్నారు. రాష్ట్రీయ రైఫిల్స్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌, జమ్ముకశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా ఈ తనిఖీలను నిర్వహించారు.
జమ్ముకశ్మీర్ లో పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించినప్పుడల్లా ఇలా తీవ్రవాదులు బయటకు రావడం.. భద్రతా బలగాలపై ఎదురు తిరగడం జరుగుతూనే ఉంది. ఇంకా ఆ ప్రాంతాల్లో తీవ్రవాదులకు కొందరు ఆశ్రయం ఇస్తూ ఉండడంతో తీవ్రవాదులు పుట్టుకొస్తూనే ఉన్నారు.