చైనా.. ఎన్నో విషయాల్లో భారత్ ను ఇబ్బంది పెట్టింది.. ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించింది. పాకిస్తాన్ కు చాలా విషయాల్లో మద్దతుగా నిలిచింది ఈ డ్రాగన్ కంట్రీ..! అయినా ఇటీవల కరోనా వైరస్ దెబ్బకు చైనా వణికిపోతున్న తరుణంలో ఆ దేశాన్ని ఆదుకున్న మొట్టమొదటి దేశం భారతదేశమే..! 2003లో సార్స్ వైరస్ ప్రబలినప్పుడు కూడా భారత్ చైనాకు అండగా నిలిచింది. ఇప్పుడు కూడా భారత్ ఎన్నో విషయాలలో చైనాకు సహాయసహకారాలందించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా చైనాకు మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు.

కష్టకాలంలో భారత్‌ ఎప్పుడూ మా వెన్నంటే ఉందని, వారి సాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటామని భారత్‌లో చైనా రాయబారి సున్‌ వీడోంగ్‌ స్పష్టం చేశారు. భారత్‌ నుంచి చైనాకు భారీ ఎత్తులో వైద్య పరికరాలు పంపించారు.. ఇందుకు చైనా కృతజ్ఞతలు తెలిపింది. భారత్ అందిస్తున్న సాయాన్ని కొనియాడారు. చైనా కష్టాల్లో ఉన్న ప్రతిసారీ భారత్ స్నేహ హస్తం అందిస్తూనే ఉందని భారత్ ను ఆకాశానికి ఎత్తేశాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తమను ఆదుకున్న పలు దేశాలకు కృతజ్ఞతలు తెలిపింది చైనా.

కోవిద్-19 పాజిటివ్ గా వచ్చిన వారిలో 80 శాతానికి పైగా రికవర్ అయినట్లు తాజా డేటా చెబుతోంది. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నివేదిక ప్రకారం కరోనా వైరస్ బారిన పడినోళ్లలో 80 శాతం మంది రికవర్ అయ్యారని తెలుస్తోంది. కోవిడ్-19 పాజిటివ్ కేసుల్లో 30 నుండి 79 సంవత్సరాల వయసు ఉన్న వారే 86 శాతం మంది ఉన్నారట..! 80 ఏళ్ల వయసు పైబడిన వారే ఎక్కువగా చనిపోతున్నారని తాజా నివేదికలో తేలింది. 9 సంవత్సరాల వయసు లోపల ఉన్న వారెవరూ చైనాలో చనిపోలేదని తెలుస్తోంది.