గత ఏడాది వేసవి కాలంలో ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రజలు పడిన ఇబ్బందులు అంతా ఇంతా కావు.. ఈ ఏడాది కూడా అంతకు మించి ఉష్ణోగ్రతలు ఉండబోతున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది ఇంకా ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండబోతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ వేసవి గత దశాబ్దంలోనే అత్యధిక వేడి ఉండబోతోందని హైదరాబాద్ లోని భారతీయ వాతావరణ విభాగం శాస్త్రవేత్త బి. రాజారావు హెచ్చరిస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరుకు వాతావరణం మరింత వేడెక్కుతుందని ఆయన అన్నారు. ఫిబ్రవరి నెలాఖరుకే తెలంగాణలోని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్ వరకూ వెళ్లనున్నాయి. తెలంగాణ లోని మొత్తం 33 జిల్లాల్లో 28 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. మంచిర్యాల జిల్లాలో 37.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవ్వగా.. పెద్దపల్లి జిల్లాల్లో 37.7 డిగ్రీలు, వికారాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, జగిత్యాల, కొత్తగూడెంలలో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉన్నాయి. ఆదివారం నాడు హైదరాబాద్ లో 32.7 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయ్యింది.