ఫిబ్రవరి 14 , 2019… భారత దేశ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజు.. 44 మంది భారత జవాన్లను ఉగ్రవాద రక్కసి మూకలు పొట్టన పెట్టుకున్న రోజు.. మంచు కొండల మధ్యలో విధులు నిర్వర్తించడానికి వెళ్తున్న సైనికులపై పేలుడు పధార్థాలతో దాడి చేసి, ఆసేతు హిమాచలాన్ని శోక సముద్రంలో ముంచేసారు..భారతదేశంలో ఫిబ్రవరి 14 ను బ్లాక్ డే గా మార్చారు.. 40 మందికి పైగా సైనికులు కుటుంబాలతో గడిపిన ఆనందకరమైన క్షణాలను నెమరువేసుకుంటూ జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఇంతలోనే ఓ పేలుడు పదార్థాలు కలిగిన వాహనం వచ్చి ఢీకొట్టింది..భయంకరమైన శబ్థాలు, చుట్టు పక్కల తెల్లటి మంచు ప్రాంతంలో నల్లటి బూడిద మిగిలింది.. ఉగ్రవాద రక్కసి కోరలు విప్పి భారత జవాన్లపై పంజా విసిరింది.. దానితో 44 మంది సైనికులు అమరులయ్యారు..

2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్ లో జమ్ము శ్రీనగర్ జాతీయరహదారిలో భారతీయ సైనికులను తీసుకెళ్తున్న కాన్వాయ్ పై పుల్వామా ప్రాంతంలో కారులో పేలుడు పధార్థాలు నింపి, ఆత్మాహుతి బాంబుదాడి జరిగింది..ఆ సంఘటనతో యావత్ భారతదేశం షాక్ కు గురైంది..దేశంలో ఎక్కడ చూసిన సైనికుల మరణించారనే బాధతో కన్నీరు మున్నీరు అయింది.. పుల్వామా ఉగ్రదాడిపై యావత్ భారతం రగిలియింది. పాకిస్తాన్ ఉగ్రోన్మాదంపై కోపం కట్టలు తెంచుకుంది. దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్లకు కన్నీటి నివాళి అర్పిస్తున్నారు దేశ ప్రజలు. అటు అమరుల త్యాగాలను వృథా కానివ్వమని హామీ ఇచ్చారు ప్రధాని. పాకిస్తాన్‌కు ధీటైన సమాధానం చెబుతామని స్పష్టంచేశారు. జమ్మూకశ్మీర్‌లో టెర్రరిస్టులు నెత్తుటేరులు పారించి దేశం అంతటా విషాద ఘంటికలు మోగించారు.

పుల్వామాలో భారతీయ జవాన్ల లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడిని భారత సంతతికి చెందిన అమెరికన్లు తీవ్రంగా ఖండించారు. ఉగ్రముఠాలపై పాకిస్థాన్‌ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహించారు. తమ భూభాగంలోని ఉగ్రస్థావరాలన్నిటినీ పాకిస్థాన్‌ ధ్వంసం చేయాలని నినదించారు. అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌కు చెందిన పలువురు కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ దాడికి వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు నిర్వహించారు.. వివిధ దేశాల్లో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులు ఉగ్ర చర్యలకు సరైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.అంతేకాదు దేశం మొత్తం శత్రదేశం పాకిస్థాన్ పై నిప్పులు గక్కడం ప్రారంభించారు..కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయుడు అమరులైన జవాన్లకు కన్నీటి నివాళులు అర్పించారు.. పుల్వామా ఆత్మహూతి దాడికి తామే పాల్పడినట్టు జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ ఉగ్రదాడికి పాకిస్థాన్ నుంచి వ్యూహరచన చేసినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. పుల్వామా ఆత్మాహుతి దాడికి పఠాన్‌కోట్ ఉగ్రదాడి సూత్రధారి, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ సూచనలు ఇచ్చినట్టు గుర్తించారు. అంతేకాదు రావల్పిండిలోని ఆర్మీ బేస్ హాస్పిటల్ నుంచే తన పథకాన్ని అతడు అమలు చేసారని కనిపెట్టారు..
అయితే ఆ తరువాత ఈ దుశ్చర్యకు బాలకోట్ లో జరిపిన మెరుపు దాడులతో పుల్వామా అటాక్ కు సరైన సమాధానం చెప్పారని భావించారు..భారతదేశం మొత్తం అమరులైన జవాన్లకు ఇదే అసలైన నివాళులని పేర్కొన్నారు.. బాలకోట్ లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు పేర్కొన్నారు.. అంతేకాదు దరిదాపుల్లోని ఉగ్రస్థావరాల్ని పూర్తిగా ధ్వంసం చేశారు.. ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పారని అందరు ప్రశంసించారు.. యావత్ భారతదేశాన్ని విషాదంలో ముంచి వేసిన ఈ ఘటన కూడా ఫిబ్రవరి 14 నే జరగింది.. కాబట్టి మొత్తం దేశాన్ని కలవరపరిచిన ఈ ఘటనకు వ్యతిరేకంగా అందరు ఈ రోజును బ్లాక్ డే గా నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ సంఘటన తరువాత దేశం అంతా ఏకమై అమరులైన సైనికుల కుటుంబాలకు ఆర్ధికంగా సహాయం అందించి మేమున్నాము అనే ధైర్యాన్ని అందించారు..ఇక సైనికుల పార్ధీవ దేహాలను ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించి సొంతూరుకు తరలించారు..44 మంది జవాన్ల పార్ధీవ దేహాలను సొంతూరికి తరలించిన తరువాత ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి నివాళులు సమర్పించారు..
అమర జవాన్ల అంతిమయాత్రలో అనేక మంది ప్రజలు పాల్గొన్నారు.. దేశం మొత్తాన్నీ కలచివేసిన ఈ ఘటన జరిగి సంవత్సరం అవుతున్నప్పటికి, ఆ సంఘటన తలచుకుంటే రక్తం మరిగిపోతుంది.. ప్రతి భారతీయుడి గుండె విషాదంతో కన్నీరు పెట్టుకుంటుంది.. అమర జవాన్లను తలచుకొని దేశానికి వారందించిన సేవలను గుర్తు చేసుకుని అందరం సైనికుల కుటుంబాలకు తోడుగా నిలవాలని నిర్ణయించుకున్నారు.. ఈ దుర్ఘటన జరిగి ఏడాది పూర్తి అయ్యింది.. కలలో కూడా మళ్ళీ ఇలాంటి దాడులు జరగకూడదని, దేశ ప్రజల కోసం నిద్రాహారాలు మాని గస్తీ కాస్తున్న భరతమాత ముద్దు బిడ్డల కోసం అందరు ఏకమై వారు క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థించాలని కోరుతున్నారు.. అంతేకాదు ఫిబ్రవరి 14 వ తేదిని భారతదేశ చరిత్రలో బ్లాక్ డే గా ఉండాలని పిలుపునిచ్చారు… దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి, పరిస్థితులతో నిత్యం యుద్దం చేస్తూ.., బుల్లెట్ కు కూడా ధైర్యంగా గుండెను చూపే వ్యక్తే జవాన్.. దేశాన్ని రక్షించే సైనికులు..దేశానికి అన్నం పెట్టే రైతులది అసలైన ప్రేమ అంటే… నిస్వార్ధమైన , నిజమైన ప్రేమకు అర్ధం జవాన్-కిసాన్. దేశం కోసం, ప్రజల కోసం , నలుగురు బ్రతకాలని కోరుకునే నిస్వార్ధమైన ప్రేమ సైనికులది.. మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన వారందరికి నివాళులు అర్పిద్దాం..