నేర చరిత్ర ఉన్న నాయకులు తమ ఎమ్మెల్యేగా.. ఎంపీగా ఎంపీగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకుంటారు చెప్పండి. కానీ మన న్యాయవ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ ను వాడుకుని ఇప్పటికీ బడా నేతలుగా ఎదుగుతూ ఉన్నారు. ప్రజలను పట్టి పీడిస్తున్నారు. అలాంటి వారిపై ఉక్కుపాదం మోపే దిశగా సుప్రీంకోర్టు అడుగులు వేస్తోంది. ప్రతి రాజకీయ పార్టీ వారి అధికారక వెబ్ సైట్లతో పాటు, సోషల్ మీడియాలో నేర చరిత్ర కలిగిన నాయకుల పూర్తి వివరాలను అప్ లోడ్ చేయాలని ఆదేశించింది. నేర చరిత్ర కలిగిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎందుకు కల్పించారో కూడా చెప్పాలంటూ అతి పెద్ద సవాల్ ను వారి ముందు ఉంచింది. నేర చరిత్ర కలిగిన అభ్యర్థికి టికెట్ ఇచ్చిన 48 గంటలల్లోగానే ఈ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని… వార్తాపత్రికల్లో కూడా ప్రచురించాలని ఆదేశించింది. 72 గంటల్లోపల అభ్యర్థి క్రిమినల్ కేసుల వివరాలను ఈసీకి అందించాలని చెప్పింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నేర చరిత్ర ఓటర్లకు తెలిస్తే వారికి ఓటు వేయాలో, వద్దో ఓటర్లే నిర్ణయించుకుంటారని.. గెలవడం ఒక్కటే రాజకీయ పార్టీల లక్ష్యం కారాదని సూచనలు జారీ చేసింది.

తీవ్రమైన నేరాలతో సంబంధం ఉన్న వ్యక్తులను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడానికి, పార్టీలలో కీలక బాధ్యతలను చేపట్టకుండా చూసేందుకు చట్టాలను మార్చాలంటూ 2018 సెప్టెంబర్ లో ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. సుప్రీంకోర్టు సూచనలను కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం పట్టించుకోలేదంటూ బీజేపీ నేత, లాయర్ అశ్విని ఉపాధ్యాయ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించగా విచారణ… అభ్యర్థుల నేర చరిత్రను ప్రచురించినంత మాత్రాన ఎలాంటి ప్రభావం ఉండదని… క్రిమినల్ కేసులు ఉన్నవారికి టికెట్లు ఇవ్వబోమని రాజకీయ పార్టీలు ప్రకటిస్తే ఉపయోగం ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపడంతో సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలను జారీ చేసింది. వీటిని పార్టీలు ఎంత వరకూ పాటిస్తాయో.. ప్రజల్లో మార్పు వచ్చి నేరగాళ్లకు పట్టం కట్టడాన్ని ఆపేస్తారో కాలమే నిర్ణయించాలి.