ఫాస్ట్ ట్యాగ్(ఫాస్టాగ్).. ఇది ఉంటే నేషనల్ హైవేలపై ఉండే టోల్ గేట్ల దగ్గర చాలా సమయం ఆదా అవుతుంది. చాలామంది వాహనదారులు ఇప్పటికే ఈ ఫాస్ట్ ట్యాగ్ స్టికర్స్ ను తమ కారుకు అతికించడం మొదలుపెట్టేశారు.. ఇంకా సంశయిస్తూ ఉన్న వాళ్లలో చైతన్యం తెచ్చేలా ఫాస్ట్ ట్యాగ్ ను 15 రోజుల పాటు ఉచితంగా అందజేయనున్నట్టు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది. దేశవ్యాప్తంగా మరో 527 హైవేలపై ఫాస్టాగ్ టోల్ వసూలు విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు కేంద్ర రోడ్ ట్రాన్స్ పోర్టు, హైవేస్ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
టోల్ ప్లాజాల్లో డిజిటల్ కలెక్షన్లను ప్రొత్సహించేందుకు 15 రోజుల పాటు ఫాస్ట్ ట్యాగ్ ను ఫ్రీగా అందించాలని కేంద్రం తెలిపింది. వాహనానికి సంబంధించి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ)ని చూపించి హైవేలపై టోల్ ప్లాజాలు, రీజనల్ ట్రాన్స్ పోర్టు ఆఫీసులు, పెట్రోల్ పంపుల వంటి పాయింట్ ఆఫ్ సేల్ లొకేషన్ కు వెళ్లి ఉచితంగా ఫాస్ట్ ట్యాగ్ ను పొందవచ్చు. మై ఫాస్ట్ ట్యాగ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని దగ్గరలో ఫాస్టాగ్ లభించే పాయింట్లు, ఇతర వివరాలను తెలుసుకోవచ్చని వెల్లడించింది.ఫాస్ట్ ట్యాగ్ కు తీసుకునే ఫీజును రద్దు చేసినా.. సెక్యూరిటీ డిపాజిట్, మినిమం బ్యాలెన్స్ లను మాత్రం చెల్లించాల్సిందే..!