తమిళనాడులో సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. అందుకే అక్కడ సినిమా స్టార్స్ లో చాలా మంది రాజకీయాల్లో రాణించారు. కమల్ హాసన్ ఇప్పటికే రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. రజనీకాంత్ కూడా రాబోయే ఎలక్షన్స్ లో తన పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్లాలని భావిస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో తమిళ హీరో భారీగా ఫాలోయింగ్ ఉన్న ఇళయ దళపతి విజయ్ కూడా రాజకీయాల్లోకి వస్తే చాలా బాగుంటుందని అంటున్నారు. ఆయన సినిమాల్లోని డైలాగ్స్, రాజకీయాలపై వేసిన సెటైర్లు కూడా విజయ్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని హింట్ ఇస్తాయి.

ఇలాంటి తరుణంలో విజయ్-ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్న పోస్టర్లు తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ‘రావాలి విజయ్..కావాలి విజయ్’ అనే నినాదంతో సినీ హీరో విజయ్‌ను రాజకీయాల్లోకి రావాలని కోరుతూ ఆయన అభిమానులు పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆ పోస్టర్లలో జగన్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఉన్నారు. ఏపీలో వైసీపీ విజయానికి, ఢిల్లీలో ఆప్ విజయానికి ప్రశాంత్ కిశోర్ వ్యూహాలే కారణమని నమ్మే వారు చాలా మందే ఉన్నారు. అలాంటిది ప్రశాంత్ కిశోర్-విజయ్ కలిసి పనిచేస్తే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ఆలోచనతో ఈ పోస్టర్లు వెలిశాయి.