న్యూజిలాండ్ లో సుదీర్ఘ టూర్ కు అడుగుపెట్టిన భారతజట్టు టీ-20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయగా.. వన్డే సిరీస్ లో మాత్రం 0-3తో ఓటమి పాలైంది. రెండో వన్డేలో భారత్ అంతో ఇంతో పోరాడినప్పటికీ.. మొదటి వన్డే-ఆఖరి వన్డేలలో భారతజట్టు కనీసం పోరాడలేకుండా పోయింది. వన్డే సిరీస్ ఓటమిపై భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. వన్డే సిరీస్ లో తమ బౌలింగ్, ఫీల్డింగ్ అంతర్జాతీయ స్థాయిలో లేవని, మ్యాచ్ లు గెలిపించడానికి తమ జట్టు చేసిన ప్రయత్నాలు సరిపోవని అభిప్రాయపడ్డాడు. టి20 సిరీస్ ను ఓడిపోయిన తర్వాత న్యూజిలాండ్ ఆటగాళ్లు తీవ్రమైన గెలుపు కాంక్షతో బరిలో దిగారని, ఈ విషయంలోనే తాము వెనుకబడిపోయామని కోహ్లీ అంగీకరించాడు. ఇక తమ దృష్టంతా రాబోయే టెస్టు సిరీస్ పైనే ఉందని అన్నాడు కోహ్లీ. మూడో వన్డేలో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్ ను కివీస్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఓ వన్డే సిరీస్ లో భారత్ క్లీన్ స్వీప్ తో ఓడిపోవడం 31 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమం. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 296 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 112 పరుగులతో అలరించాడు. పృథ్వీ షా 40, మనీష్ పాండే 42 పరుగులు సాధించారు. భారత్ విసిరిన 297 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 47.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కొలిన్ డి గ్రాండ్ హోమ్ కేవలం 28 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేసి మ్యాచ్ ను కివీస్ వైపు లాగేశాడు. వికెట్ కీపర్ టామ్ లాథమ్ 32 పరుగులతో విలువైన ఇన్నింగ్స్ ఆడగా.. ఓపెనర్లు గప్టిల్ 66, నికోల్స్ 80 పరుగులు చేశారు. వన్డే సిరీస్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడిన రాస్ టేలర్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. హెన్రి నికోల్స్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.