అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు భారత్ కు అత్యంత సన్నిహితుడైన నాయకుడు. అప్పుడప్పుడు కాశ్మీర్ విషయంలో కాస్త నోటిదురుసుతో వాగినప్పటికీ ట్రంప్ చాలా విషయాల్లో భారత్ కు మద్దతుగానే నిలుస్తున్నాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనకు చాలా ప్రాధాన్యతను ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ట్రంప్ గెలిచి మరోసారి అధికార పీఠంపై కూర్చోవాలని భావిస్తున్నాడు.. అందుకు భారత సంతతి ప్రజల ఓట్లు కూడా ముఖ్యమే.. దీంతో ట్రంప్ భారతీయులకు మరింత దగ్గరవ్వాలని భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ట్రంప్ భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంటోంది. డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన తాజాగా ఖరారైంది. వైట్ హౌస్ సమాచారం ప్రకారం ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ట్రంప్ భారత్ లో పర్యటించనున్నారు. ఈ రెండు రోజుల పాటు ట్రంప్ సెక్యూరిటీ ఏర్పాట్లను అమెరికా, భారత్ సంయుక్తంగా చూసుకుంటాయి. రక్షణ రంగం బలోపేతంపై ట్రంప్ తో ప్రధాని నరేంద్ర మోదీ చర్చించనున్నారు. ట్రంప్ తో పాటు మెలానియా కూడా భారత్ కు రానున్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్ లలో పర్యటించనున్నారు.