ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 500 యూనిట్లకు పైబడి వినియోగించేవారికి యూనిట్ కు 90 పైసలు చొప్పున ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు 500 యూనిట్లకు పైబడి వినియోగిస్తున్నవారికి యూనిట్ కు రూ 9.05 ఉండగా, ప్రస్తుతం రూ. 9.95 కి పెరిగింది. చార్జీల పెంపు వల్ల ప్రభుత్వ సంస్థలతో పాటు కార్పొరేట్‌ సంస్థలతో పాటూ.. రాష్ట్రంలోని 1.35 లక్షల గృహ వినియోగదారులపై భారం పడనుంది. ఏపీఈఆర్సీ ఛైర్మన్ సీవీ నాగార్జున రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఏపీ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 14,349.07 కోట్ల ఆదాయం అవసరమవుతుండడంతో లోటును భర్తీ చేసేందుకే విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో 9,500 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉండడంతో ప్రైవేట్ విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్ కొలుగోలును నిరాకరించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి, వినియోగదారులకు రూ.2,893.48 కోట్ల ఆర్థిక భారం తగ్గిస్తూ విద్యుత్‌ పంపిణీ సంస్థలు నికర లోటును రూ.10,060.30 కోట్లుగా నిర్దారించారు. ఈ లోటును భర్తీ చేసేందుకే విద్యుత్‌ ఛార్జీలను పెంచినట్లు ఆయన తెలిపారు.