ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. కానీ ఫైనల్ లో మాత్రం బంగ్లాదేశ్ చేతిలో ఓటమిని చవిచూసింది. అలాగని భారత జట్టులోని ఆటగాళ్ల టాలెంట్ ను తక్కువ చేసి చూడలేము. ఆ అండర్-19 జట్టులోని ఆటగాళ్లలో కొందరు భారతజట్టుకు ప్రాతినిధ్యం వహించే సమయం కూడా అతి దగ్గరలో ఉంది. ఫేవరెట్స్ గా ఫైనల్ లో అడుగుపెట్టిన భారత ఆటగాళ్లను బంగ్లాదేశ్ ఆటగాళ్లు మొదటి నుండి కవ్వించడం మొదలుపెట్టారు. కొన్ని కొన్ని సార్లు బూతులు తిట్టడం.. సీరియస్ గా ఒక లుక్ వేయడం.. బంతిని బ్యాట్స్మెన్ కు దగ్గరగా విసరడం లాంటివి చేశారు. ఆ తర్వాత భారత బౌలర్లు కూడా బంగ్లా ఆటగాళ్లను రెచ్చగొట్టే పనిచేశారు. మ్యాచ్ మంచి రసపట్టులో ఉండగా వర్షం పడడం.. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్ జట్టు విజయాన్ని సాధించింది. బంగ్లా జట్టు విజయం సాధించిందని తెలిశాక ఆ జట్టు ఆటగాళ్లు దురుసుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. భారత ఆటగాళ్లను కూడా తోశారు. ఈ ఘటనపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తీవ్రంగా పరిగణిస్తోంది. బంగ్లా యువ జట్టుపై తీసుకోవాల్సిన క్రమశిక్షణా చర్యలపై చర్చించే ముందు ఘటనకు సంబంధించిన ఫుటేజ్ ని తెప్పించుకుని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై భారత జట్టు కెప్టెన్ ప్రియమ్ గార్గ్ స్పందించాడు. తమ జట్టు ఓటమిని స్వీకరించిందని అన్నారు. గేమ్ లో ఓడిపోవడం, గెలవడం చాలా సహజమని అభిప్రాయపడ్డాడు. గెలుపు అనంతరం బంగ్లా ఆటగాళ్లు అలా ప్రవర్తించకుండా ఉండాల్సిందని చెప్పాడు.