ట్రైన్ లు ఆలస్యంగా వచ్చిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. కొన్ని.. కొన్ని.. సార్లు గంటల పాటూ రైళ్లు ఆలస్యమయ్యేవి. అలా జరగడం వలన ప్రయాణీకుల్లో అసహనం అన్నది చాలా కామన్..! అదే జపాన్ లాంటి దేశాల్లో ట్రైన్ లు ఆలస్యంగా వస్తే ప్రయాణీకులకు పరిహారం అందించడం.. వారిని క్షమాపణలు కోరడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మన దేశంలో కనీసం పట్టించుకునే నాథుడు ఎవరూ ఉండరంటూ ఆరోపణలు కూడా వచ్చేవి. ఇప్పుడు పద్ధతులు మారుతూ ఉన్నాయి. ట్రైన్ ల వేగం పెరగడం దగ్గర నుండి.. నిర్ణీత సమయాలకు రైల్వే స్టేషన్ కు చేరుకునే చర్యలు కూడా చేపట్టారు.. అవన్నీ సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇప్పుడు ఐఆర్సీటీసీ కూడా ట్రైన్ ఆలస్యం అయినందుకు ప్రయాణీకులకు నష్టపరిహారం చెల్లిస్తోంది.

అహ్మదాబాద్, ముంబై మధ్య తేజస్ ఎక్స్ ప్రెస్ రైలును ఇటీవల ఐఆర్సీటీసీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించింది. ఈ రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు పరిహారాన్ని ఇవ్వాల్సివుంటుంది. నిర్ణీత సమయం కన్నా గంట ఆలస్యంగా గమ్యాన్ని చేరడంతో ఐఆర్సీటీసీ మొత్తం రూ. 63 వేల పరిహారాన్ని ప్రయాణికులకు చెల్లించనుంది. అహ్మదాబాద్ లో ఉదయం 6.42 గంటలకు బయలుదేరిన రైలు మధ్యాహ్నం 1.10 గంటలకు ముంబై చేరుకోవాల్సి వుండగా, ముంబై శివారులోని దహిసర్ – భయందర్ స్టేషన్ల మధ్య టెక్నికల్ ఫాల్ట్ ఏర్పడటంతో 2.36 గంటలకు చేరింది. గంట ఆలస్యానికి రూ. 100, రెండు గంటల ఆలస్యానికి రూ. 250 చెల్లించనున్నారు.

దేశంలోని రెండో ప్రైవేటు ఎక్స్ ప్రెస్ రైలు అయిన తేజస్ ఈ నెల 19 నుంచి సేవలను ఆరంభించింది. మంగళవారం బయలుదేరిన రైలు గంటన్నర ఆలస్యంగా గమ్యానికి చేరుకుంది. దీంతో ప్రయాణికులకు చెల్లించాల్సిన పరిహారాన్ని లెక్కించామని, రైలు జాప్యంపై దరఖాస్తు చేసే రిజర్వేషన్ ప్రయాణికులకు రిఫండ్ లభిస్తుందని అధికారులు తెలిపారు.